: చర్చించుకుందాం రండి... బహిరంగ విమర్శలొద్దు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు వెంకయ్య సూచన
‘‘సమస్యలుంటే చర్చించుకుందాం. బహిరంగ విమర్శలతో ఫలితం శూన్యం. బడ్జెట్ లో ఏదైనా అనుమానాలుంటే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలవండి’’ అంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల సీఎంలకు సూచించారు. నిన్నటి సాధారణ బడ్జెట్ పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిధుల కేటాయింపులో కేంద్రం తమకు మొండిచేయి చూపిందని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. ఇరువురు సీఎంల ఆగ్రహావేశాలను తగ్గించేందుకు వెనువెంటనే రంగంలోకి దిగిన వెంకయ్యనాయుడు, కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. నిధుల కేటాయింపుపై జైట్లీతో మాట్లాడమని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పానని వెంకయ్య తెలిపారు. నిధుల కేటాయింపులకు సంబంధించి సవరణలు చేసేందుకు యత్నిస్తామని కేసీఆర్ కు చెప్పానన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య ప్రకటించారు.