: నల్లధనం స్వచ్ఛంద వెల్లడికి చివరి అవకాశం... ఇకపై పదేళ్ల జైలు శిక్షేనట!
నల్లధనంపై బీజేపీ సర్కారు తన పోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే స్విస్ బ్యాంకుల్లోని నల్ల కుబేరుల జాబితా సేకరణలో కొద్దిమేర విజయం సాధించిన నరేంద్ర మోదీ సర్కారు, సదరు ఖాతాదారులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) విచారిస్తోంది. తాజాగా నల్లనాన్ని పోగేసిన, కూడబెట్టేందుకు యత్నించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నిన్నటి కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పలు కఠిన చర్యలను ప్రకటించారు. నల్లధనం స్వచ్ఛంద వెల్లడికి ఆరు నెలల గడువిస్తున్నట్లు ప్రకటించిన జైట్లీ, ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. ఇకపై నల్లధనం ఉందని తేలితే, పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాక ఆస్తుల వెల్లడి, ఆదాయపన్ను రిటర్న్ ల దాఖలులో అలసత్వం ప్రదర్శించే వారిపైనా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, 300 శాతం జరిమానాను విధించనున్నట్లు ఆయన ప్రకటించారు.