: బీసీసీఐ చీఫ్ రేసులో దాల్మియా... శ్రీని క్యాంపుతో మంతనాలు!


బీసీసీఐ అధ్యక్ష పదవి రేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. బీసీసీఐపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఐపీఎల్ వివాదం నేపథ్యంలో దాదాపుగా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పదవిని దక్కించుకునేందుకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్... నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనే కలిశారు. తనను ఏకగ్రీవంగా బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎంపికయ్యేలా చూడాలని ఆయన ప్రధానిని కోరారు. దీనిపై మోదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. తాజాగా బీసీసీఐలో గతంలో ఓ వెలుగు వెలిగిన జగ్ మోహన్ దాల్మియా రంగంలోకి దిగారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న దాల్మియా, బీసీసీఐ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు అందుబాటులోని అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన అన్ని అసోసియేషన్ల మద్దతు శ్రీనివాసన్ కు ఉన్న విషయం తెలిసిందే. దీంతో నేరుగా శ్రీనివాసన్ శిబిరాన్నే ఆశ్రయిస్తే తన పని సులువవుతుందని దాల్మియా భావిస్తున్నారు. అనుకున్న వెంటనే ఆయన రంగంలోకి దిగి శ్రీనివాసన్ శిబిరంతో మంతనాలు సాగిస్తున్నారు. మరి రేపు జరగనున్న ఎన్నికల్లో ఆ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News