: జోడు పదవులెందుకన్న గుసగుసలపై కేజ్రీవాల్ కినుక... పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా?


దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. అది కూడా బయటి వ్యక్తులు చేసిన విమర్శలతో కాదట. సొంత పార్టీ కార్యకర్తలు, కొంతమంది కీలక నేతలే ఆయనను అప్ సెట్ చేశారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ‘చీపురు’ విజయ కేతనంతో కేజ్రీవాల్, ఏడాది వ్యవధిలో ఢిల్లీకి రెండో సారి సీఎం అయ్యారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు పార్టీ కన్వీనర్ పదవితో పాటు ఢిల్లీ సీఎం పోస్టు దక్కిందని పార్టీ నేతలు చర్చించుకున్నారట. అంతేకాక జోడు పదవుల్లో కేజ్రీవాల్ ఎలా కొనసాగుతారని కొంతమంది నేతలు చెవులు కొరుక్కున్నారట. ఈ గుసగుసలు చివరకు కేజ్రీవాల్ చెవిన పడ్డాయి. దీంతో నాలుగు రోజుల క్రితం (గురువారం) జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసేశారని కూడా వదంతులు వినిపిస్తున్నాయి. కార్యవర్గ సభ్యుల్లో మెజార్టీ నేతలు కేజ్రీవాల్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. ఈ విషయంలో వాస్తవమెంత అన్న విషయాన్ని పక్కనబెడితే, పార్టీ కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారన్న వార్త దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరలేపింది.

  • Loading...

More Telugu News