: ‘నవ్యాంధ్ర’ భూ సమీకరణకు చివరి రోజు పోటెత్తిన రైతులు... లక్ష్యం దాటేసిన అధికారులు
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సర్కారు చేపట్టిన భూ సమీకరణకు చివరి రోజైన నిన్న(శనివారం) రైతులు పోటెత్తారు. భూ సమీకరణలో భాగంగా రాజధాని కోసం భూములనిచ్చేందుకు తొలుత నిరాకరించిన పలు గ్రామాలకు చెందిన రైతులు నిన్న మాత్రం భూ సమీకరణ కార్యాలయాల ముందు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తూ సమ్మతి పత్రాలు అందజేశారు. తొలి విడతలో 30 వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న అధికారులు, కొన్ని గ్రామాల రైతులు ముందుకురాని నేపథ్యంలో మొన్నటి (శుక్రవారం) దాకా కేవలం 25 వేల ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. అయితే చివరి రోజైన నిన్న పెద్ద సంఖ్యలో రైతులు ముందుకురావడంతో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అధికంగానే (30 వేల ఎకరాల కంటే పైగానే) భూములను అధికారులు సేకరించినట్లైంది.