: మిత్రపక్షమైనా ఇంత అన్యాయం చేస్తారా?: చంద్రబాబు దగ్గర టీడీపీ నేతల అసహనం
నేడు ప్రకటించిన కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ నేతలు, ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. సాక్షాత్తు ఏన్డీయేలో భాగస్వాములైన టీడీపీ నేతలు కూడా బడ్జెట్ నిరాశాజనకంగా ఉందంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో, పార్లమెంటులో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత పలువురు టీడీపీ మంత్రులు, నేతలు చంద్రబాబుతో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం దారుణమని, ఈ సందర్భంగా బాబుతో వీరు చెప్పారు. మిత్రపక్షమైన టీడీపీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్, బీహార్ లతో సమానంగా సాయం చేస్తామనడం అవమానించినట్టేనని అభిప్రాయపడ్డారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించడమేమిటని ప్రశ్నించారు. జరిగిన అన్యాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చంద్రబాబును కలిసిన వారిలో టీడీపీ మంత్రులు ఉమా, అచ్చెన్నాయుడుతో పాటు సీనియర్ నేత సోమిరెడ్డి కూడా ఉన్నారు. వీరితో పాటు బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఉన్నారు.