: పుతిన్ ను విమర్శించినందుకు మాస్కోలో మాజీ ఉప ప్రధానిని కాల్చి చంపిన దుండగులు


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను విమర్శించినందుకు మాస్కో నడిబొడ్డులో విపక్ష నేత బోరిస్ నెమత్సోవ్ (55)ను దారుణంగా హత్య చేశారు. బోరిస్ యల్సిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నెమత్సోవ్ ఉప ప్రధానిగా విధులు నిర్వహించారు. 2003లో పదవిని కోల్పోయిన ఆయన పుతిన్ వ్యవహార శైలిని తరచూ విమర్శించేవారు. ఆయన అధ్వర్యంలో ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. దేశంలో ఆర్థిక కష్టాలు పెరగడానికి పుతిన్ చర్యలే కారణమంటూ, మరో రెండు రోజుల్లో ఆయన భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంలో రష్యా భాగం కావడాన్నీ ఆయన తప్పుబట్టారు. మాస్కోలోని చారిత్రక క్రెమ్లిన్ వద్ద ఆయన నడిచి వెళ్తుండగా, ఒక కారులో వచ్చిన దుండగులు తుపాకితో 7 సార్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ప్రభుత్వమే చేయించిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా, ఆ హత్య జరిగిన సమయంలో అక్కడ వున్న పాదచారులను ప్రశ్నిస్తున్న పోలీసులు, ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.

  • Loading...

More Telugu News