: నట'సింహం' బాలయ్యకు అభిమానుల విలువైన బహుమతి!
నటుడు బాలకృష్ణను అభిమానులు ప్రేమగా 'నందమూరి నటసింహం' అని పిలుచుకుంటారన్న సంగతి విదితమే. ఇందుకు గుర్తుగా విలువైన ఓ 'సింహం' బొమ్మను బాలయ్య వందవ చిత్రం ప్రారంభోత్సవ సమయంలో బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రూ.10,00,000 లతో 'గోధుమ రంగు క్రిస్టల్ గ్రానైట్ లయన్' (10* 4.5 అడుగులు)ను తయారు చేయించబోతున్నారట. "6 నుంచి 9 నెలల్లో ఆ విగ్రహాన్ని సిద్ధం చేయించాలని అనుకుంటున్నాం. బాలయ్య 100వ చిత్రం ప్రారంభం నాటికి సిద్ధమవుతుందనుకుంటున్నాం. ఒక స్టార్ (ఎన్టీఆర్) కుమారుడిగా ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తి ఆయనే. అందుకే ఆ క్షణాలను మేము సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం" అని ఎన్ బీకే హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపకుడు అనంతపురం జగన్ తెలిపారు. అంతేగాక 'నందమూరి శిఖరం' పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రూపొందించి విగ్రహంతో పాటు తమ అభిమాన నటుడికి సమర్పించాలనుకుంటున్నారు. "ఈ పుస్తకం తొలి పేజీని బాలయ్య సతీమణి వసుంధర రాస్తారు. వెయ్యి పేజీలతో ఉండే ఆ పుస్తకంలో బాలయ్యతో పనిచేసిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల గురించి, బాలయ్య సినీ ప్రయాణం ప్రతిబింబించే విధంగా ఉంటుంది" అని జగన్ వెల్లడించారు.