: వాళ్లు కోహ్లీకి దరిదాపుల్లో లేరు: ముదస్సర్ నాజర్
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ముదస్సర్ నాజర్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నాడు. 80వ దశకంలో పాక్ జట్టులో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా ఖ్యాతి గడించిన నాజర్ ప్రస్తుతం యూఏఈ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. శనివారం భారత్, యూఏఈ జట్ల మధ్య పెర్త్ లో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నాజర్ పీటీఐతో మాట్లాడాడు. కోహ్లీ... ఏబీ డివిలీర్స్, డేవిడ్ వార్నర్ ల స్థాయి ఆటగాడని, వారు ముగ్గురూ ప్రస్తుత క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ అని అభివర్ణించాడు. ఇక, పాకిస్థాన్ లో అత్యుత్తమ ఆటగాడిగా ప్రచారంలో ఉన్న ఉమర్ అక్మల్ కాదుకదా, మరే ఇతర పాక్ బ్యాట్స్ మెన్ కూడా కోహ్లీకి దరిదాపుల్లో లేరని అభిప్రాయపడ్డాడు. అక్మల్, షేజాద్ లు కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో ఆడారని, ఆ టోర్నీలో కోహ్లీ నేతృత్వంలో భారత్ కూడా ఆడిందని తెలిపాడు. అప్పుడు కూడా కోహ్లీ క్లాస్ చాటుకున్నాడని గుర్తు చేశాడు. ఉమర్ అక్మల్ కూడా ప్రతిభావంతుడే అయినా, కోహ్లీ నాణ్యత అతడిలో లేదని స్పష్టం చేశాడు.