: కూరలు తరిగినట్టుగా మనుషుల తలలు నరికే ఉగ్రవాది బ్రిటన్ జాతీయుడే... బహిర్గతం చేసిన మీడియా
ముఖం కనిపించకుండా నల్లటి ముసుగు కట్టుకొని, కూరలు తరిగినట్టుగా బతికున్న మనుషుల తలలు నిర్భీతిగా తెగనరికి, వీడియోల రూపంలో బయటి ప్రపంచానికి తెలిసిన ఐఎస్ఐఎస్ ముఖ్య నేత 'జీహాదీ జాన్' అసలు పేరు, రూపాన్ని బ్రిటిష్ మీడియా వెల్లడించింది. అతని పేరు మహమ్మద్ ఏమ్వాజీ అని, బ్రిటన్ లో జన్మించి, ఆపై 20 సంవత్సరాల తరువాత కువైట్ కు వెళ్ళాడని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై బ్రిటిష్ పోలీసులు ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. అమెరికన్ జర్నలిస్ట్ జేమ్స్ ఫాలీని హత్య చేసి తొలిసారిగా ఏమ్వాజీ వీడియోలో కనిపించాడు. కాగా, ఎమ్వాజీ తనకు ప్రాణాలతో కావాలని బ్రిటన్ కు చెందిన డ్రాగానా హెయిన్ కోరుతోంది. ఆమె భర్త డేవిడ్ హెయిన్స్ ను హత్య చేసిన ఎమ్వాజీ, హత్య వీడియోను పంపించాడు. ఇప్పుడిక జిహాదీ జాన్ అసలు పేరు తెలియడంతో అతడి వల్ల నష్టపోయిన పలు కుటుంబాలు ఆ రాక్షసుడు చావాలని కోరుకుంటున్నాయి. అతడు సైన్యం దాడుల్లో సులువుగా చనిపోవడానికి వీలు లేదని, కటకటాల్లో పెట్టి మరణశిక్ష విధించాలని డ్రాగానా అంటోంది.