: సచిన్ దగ్గరికి వెళ్లేందుకు కోహ్లీకే అవకాశం... గంగూలీ
సచిన్ టెండూల్కర్ సాధించిన అనేక రికార్డులను బద్దలు కొట్టాలంటే, ప్రస్తుతానికి కోహ్లీకే అవకాశాలు అధికంగా ఉన్నాయని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అత్యధిక సెంచరీల రికార్డు (49 సెంచరీలు)ను కోహ్లీ అధిగమిస్తాడన్నట్టుగానే ఆయన మాట్లాడాడు. ఇప్పటికే, వన్ డేల్లో కోహ్లీ 22 సెంచరీలు కొట్టిన సంగతిని గుర్తు చేసిన ఆయన, ఎంతలేదన్నా మరో 10 సంవత్సరాల పాటు కోహ్లీ ఆడతాడు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు. ప్రతి ఒక్కరి రికార్డు కూడా బ్రేక్ అవుతుందని, అయితే సచిన్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డు మాత్రం సురక్షితమని, అది చిరకాలం నిలిచివుంటుందని వివరించాడు. దక్షిణాఫ్రికాను భారత్ 130 పరుగుల తేడాతో ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదని, ఈ మ్యాచ్ తరువాత భారత్ ఫామ్ ఇతర జట్లకు తెలిసిందని, నాకౌట్ దశలో ఎవరు నిలుస్తారో చెప్పడం కష్టమని గంగూలీ అన్నారు. ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. టాస్ ఓడిపోతే ధోనీ జట్టు ఎలా ఆడుతుందనేది చూడాలని అన్నాడు.