: ‘హైకోర్టు’ కోసం రంగారెడ్డి కోర్టులో రణరంగం... ఆందోళనలో లాయర్లు, చుట్టుముట్టిన ఆర్ఏఎఫ్
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలన్న టీ లాయర్ల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. హైకోర్టు విభజనను డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన తెలంగాణ న్యాయవాదులు, నేటి ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో నిరసనకు దిగారు. మెయిన్ గేటు మూసివేసిన లాయర్లు న్యాయమూర్తులు సహా ఏ ఒక్కరూ లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. లాయర్ల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. అయినా వెనక్కు తగ్గని లాయర్లు ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు న్యాయవాదులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు, న్యాయవాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.