: ఏపీకి కొత్త ఎక్స్ ప్రెస్... ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ మార్చుకోవచ్చు: వెంకయ్య
కేంద్ర రైల్వే బడ్జెట్ లో ఆశించిన మేర కేటాయింపులు లేని తెలుగు రాష్ట్రాలకు కాసింత వెసులుబాటు లభించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన చేశారు. ఎప్పటి నుంచో హైదరాబాదు, దేశ రాజధాని ఢిల్లీ మధ్య తిరుగుతున్న ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును మార్చుకోవడానికి తెలంగాణ సర్కారు యత్నిస్తోంది. మరోవైపు దేశ రాజధానికి వెళ్లేందుకు తమకు కూడా ఓ కొత్త ఎక్స్ ప్రెస్ ను ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్నటి రైల్వే బడ్జెట్ లో రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ అంశాలను ప్రస్తావించ లేదు. దీంతో డీలా పడ్డ ఇరు రాష్ట్రాలకు కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును మార్చుకునే వెసులుబాటు తెలంగాణకు ఉందని ప్రకటించిన ఆయన, ఏపీికి త్వరలోనే కొత్త ఎక్స్ ప్రెస్ ను ప్రకటిస్తామని వెల్లడించారు.