: రామయ్య కల్యాణానికి చిలకమ్మతో సమాచారం!
శ్రీరామనవమి పర్వదినంనాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులకు రామ చిలుకలతో ‘పిలుపును’ అందించే కార్యక్రమం వైభవంగా జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 4 రామచిలుకలను 4 వేదాలుగా పూజిస్తూ ‘శ్రీరామ’ నామాన్ని జపించారు. అనంతరం ప్రత్యేకంగా ముద్రించిన కల్యాణోత్సవ శుభలేఖలను చిలుకలకు కట్టి పూజించారు. కోటి తలంబ్రాలు, మేళతాళాలతో భద్రాచలానికి కదులుతున్న విషయాన్ని రామయ్యకు తెలియజేయాలని కోరుతూ చిలుకలను గాలిలోకి విడిచారు. ప్రతియేటా చిలుకలతో పిలుపులు ఈ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే.