: విశాఖ టీడీపీలో కోల్డ్ వార్... మంత్రి అయ్యన్న తీరుపై ఎంపీ అవంతి ఆగ్రహం
విశాఖపట్నం జిల్లా టీడీపీలో మరోమారు విభేదాలు రచ్చకెక్కాయి. మొన్నటికి మొన్న అధికారుల బదిలీ వ్యవహారంపై మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్ ల మధ్య వివాదం నెలకొంది. మాడుగుల నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులను అయ్యన్నపాత్రుడు నేడు ప్రారంభించనున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఎంపీ అవంతి శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ లేకుండా ఎలా శంకుస్థాపనలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న తనను విస్మరించి శంకుస్థాపనలు చేస్తే, సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాల్సి వస్తుందని ఆయన అయ్యన్నకు హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని అవంతి శ్రీనివాస్, ఈ విషయంపై నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడి కార్యక్రమాలపై సందిగ్ధం నెలకొంది.