: త్వరలో ఏపీకి మంచి రోజులు... పార్లమెంటులో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రానున్నాయని ఆయన ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణ్ జైట్లీ ప్రసంగానికి అడ్డుతగిలిన కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం, ఏపీ రెవెన్యూ లోటు మాటేమిటని నిలదీశారు. దీంతో స్పందించిన అరుణ్ జైట్లీ, ఏపీకి రెవెన్యూ లోటు ఉన్న విషయం తమకు తెలుసన్నారు. ఏపీకి త్వరలో మంచి రోజులు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. రేపు కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిన్నటి జైట్లీ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. బడ్జెట్ లో భాగంగా ఏపీకి అరుణ్ జైట్లీ ఎలాంటి కేటాయింపులు ప్రకటించనున్నారన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.