: పవన్ కల్యాణ్, అన్యాయానికి గురవుతున్నాం... స్పందించండి: బేతపూడి రైతులు
నవ్యాంధ్ర రాజధాని పేరిట భూ సమీకరణలో భాగంగా తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నామని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించాలని తుళ్లూరు మండలం బేతపూడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ‘‘మీరు అండగా ఉన్నామని చెప్పడంతోనే మీరు చెప్పిన పార్టీకి ఓట్లేశాం. ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతోంది. అందుకోసమే మీ స్పందన కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది’’ అంటూ బేతపూడికి చెందిన 30 మంది రైతులు ఆందోళనకు దిగారు. గ్రామానికున్న 450 ఎకరాల్లో ఉడా 250 ఎకరాలు తీసుకోవడంతో ప్రస్తుతం 200 ఎకరాలు మిగిలిందని వారు తెలిపారు. తాజాగా మిగిలిన 200 ఎకరాలను కూడా తీసుకుంటామంటున్న ప్రభుత్వం ఏడాదికి రూ.30 వేలు ఇస్తామంటోందని, ఇది ఏ మూలకూ సరిపోదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తరఫున పవన్ కల్యాణ్ నిలవాలనే ఉద్దేశంతోనే ఆందోళనకు దిగామని వారు చెప్పారు.