: ఎవరీ కృష్ణ కరాటే?... టీమిండియాతో పోరుకు తహతహ!


కృష్ణ కరాటే... పేరు చూస్తే కాస్త విచిత్రంగా ఉంది కదూ! పూర్తి పేరు కృష్ణ చంద్రన్ కరాటే. ఓ క్రికెటర్. కేరళలోని కొల్లంగోడ్ అతని స్వగ్రామం. కృష్ణ కరాటే ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఆడుతున్నాడు. కేరళ కుర్రాడైతే ఆడాల్సింది టీమిండియా తరపున కదా... మరి, జట్టులో అలాంటి పేరెప్పుడూ వినలేదే... అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే... ఈ యువకుడు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టు తరపున వరల్డ్ కప్ లో ఆడుతున్నాడు. బెంగళూరులో స్కూల్ క్రికెట్ ఆడిన కృష్ణ కేరళ అండర్-19 జట్టుకు ఎంపికై ప్రతిభను చాటాడు. 2008లో విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడుతో మ్యాచ్ ఆడి 35 పరుగులు చేశాడు. అశ్విన్, మురళీ విజయ్, బద్రీనాథ్ వంటి హేమాహేమీలున్న తమిళనాడుతో మ్యాచ్ లో కేరళ 91 పరుగులకే ఆలౌట్ కాగా మనోడే టాప్ స్కోరర్. ఆ మ్యాచ్ లో కేరళ ఓటమిపాలవగా, ఆ తర్వాత కృష్ణ కరాటేకు కేరళ వన్డే జట్టులో చోటు దక్కలేదు. అటు, కుటుంబ పోషణ భారం మీద పడడంతో దుబాయ్ బాటపట్టాడు. అక్కడ క్లబ్ క్రికెట్ ఆడుతూ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కార్గో విభాగంలో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ గా చేరాడు. అక్కడ అతని బాస్ నరేంద్ర జడేజా. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సోదరుడే నరేంద్ర. దీంతో, కృష్ణకు మంచి ప్రోత్సాహం లభించింది. అలా యూఏఈ జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. తాజాగా, మీడియాతో మాట్లాడుతూ, భారత్ తో ఫిబ్రవరి 28న జరిగే పోరు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. అన్నట్టు... మనోడు స్కూల్ క్రికెట్లో రాబిన్ ఊతప్పతో కలిసి ఆడాడు. ఇక, కాలేజీ లెవెల్లో స్టూవర్ట్ బిన్నీ సహచరుడయ్యాడు. అంతేగాదు, పేసర్ శ్రీశాంత్ అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో ఇద్దరూ ఒకే రూంలో ఉండేవారట. అప్పట్లో వరల్డ్ కప్ ఆడడం అనేది ఓ స్వప్నం అని, ఇప్పుడది సాకారమైందని కృష్ణ అన్నాడు. ఇక, తన పేరులోని కరాటే గురించి చెబుతూ అది తన తల్లి తరపు కుటుంబ నామం అని వివరించాడు. అంతేగానీ, తానేమీ కరాటే ప్రేమికుడిని కాదని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ అంటే విపరీతమైన అభిమానమట.

  • Loading...

More Telugu News