: వెంకయ్య క్షమాపణ చెప్పాల్సిందే: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే
విపక్షాలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. విపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న వెంకయ్య వ్యాఖ్యలపై నేటి పార్లమెంటు సమావేశాల్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే. వెంకయ్యపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విపక్షాలు, మంత్రి క్షమాపణలు చెప్పని పక్షంలో రైల్వే బడ్జెట్ ను అడ్డుకుని తీరతామని తేల్చిచెప్పాయి. అయితే విపక్షాల డిమాండ్లను పట్టించుకోని వెంకయ్య తన వ్యాఖ్యలపై వివరణ మాత్రం ఇచ్చారు. దీనికి ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వెంకయ్య నుంచి తాము వివరణ కోరలేదని, క్షమాపణలు కోరామని ఖర్గే అన్నారు.