: 'స్వచ్ఛ మాస్కో' కోసం 12 హత్యలు చేసిన దంపతులు
రష్యా రాజధాని మాస్కోను 'స్వచ్ఛ నగరం'గా చూడాలన్న మంచి కోరికతో, ఉన్మాదులుగా మారి 12 మందిని చంపారో దంపతులు. ఒక బ్యాంకు ఉద్యోగి హత్యకు గురికావడంతో, విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం ఉదంతాన్ని వెలుగులోకి తేగా, రష్యాలో సంచలనం రేగింది. కూడు గూడులేక ఫుట్ పాతులు, పబ్లిక్ పార్కుల్లో పడుకున్నవారు, పీకలదాకా మందు కొట్టి దారి తెలియక పడిపోయినవారే వీరి లక్ష్యం. అనాధలు, అభాగ్యులు, తాగుబోతులు కనిపించని 'స్వచ్ఛ' మాస్కో నగరాన్ని స్థాపించడమే తమ లక్ష్యమని పోలీసు విచారణలో వీరు వెల్లడించడంతో పోలీసులే విస్తుపోయారు. ఈ హత్యలన్నీ 20 ఏళ్ల పాల్ వయితోవ్, 25 ఏళ్ల ఎలేనా లోబచేవ దంపతులు జూలై 2014 తరువాత చేసినవే కావడం గమనార్హం. కేవలం కత్తులు మాత్రమే హత్యలకు వాడారట. అనాధల హత్యలు జరిగినప్పుడు పట్టించుకోని మాస్కో పోలీసులు బ్యాంకు ఉద్యోగి సెర్గీ యెవ్ శ్చెవ్ హత్య తరువాత వీరిని అరెస్ట్ చేశారు. ఓ స్నేహితుడిని కలిసేందుకు పబ్లిక్ పార్కులో నిరీక్షిస్తుండగా ఈ దంపతులు దాడిచేసి కత్తులతో 107 సార్లు పొడిచి పాశవికంగా హత్య చేశారట. ప్రస్తుతం వీరు కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు.