: మోదీ గద్దెనెక్కాక 685 సార్లు కాల్పులకు తెగబడ్డ పాక్
గత సంవత్సరం జూన్ నుంచి ఈ జనవరి వరకూ సరిహద్దుల్లోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ 685 సార్లు కయ్యానికి కాలు దువ్వేలా కాల్పులు జరిపినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఎనిమిది నెలల కాలంలో భారత సరిహద్దు ప్రాంతాలపై, మిలటరీ క్యాంపులపై పాక్ ఈ కాల్పులు జరిపిందని... ఈ ఘటనలలో 16 మంది పౌరులు, 8 మంది సైనికాధికారులు మృతి చెందినట్టు వివరించింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పలుమార్లు తూట్లు పొడిచిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్మీ అధీనంలో ఉన్న నియంత్రణ రేఖ వద్ద 126, సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) పరిధిలో ఉన్న భాగంలో 559 సార్లు కాల్పులు జరిగినట్టు వివరించారు.