: గుంటూరు జిల్లాలోనూ భూప్రకంపనలు... రిక్టర్ స్టేలుపై 4.0 తీవ్రతగా నమోదు
ఏపీ రాజధాని ఏర్పాటవుతున్న గుంటూరు జిల్లాలోనూ నేటి ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లాలో భూమి కంపించిన సమయంలోనే గుంటూరు జిల్లాలోనూ భూప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల్లో చోటుచేసుకున్న భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు అద్దంకి, ఇంకొల్లు, పర్చూరు, చీరాల, యద్దనపూడి మండలాలతో పాటు గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, గోపాలవారిపాలెం, మురికిపూడి, మద్దిరాల, ఎడవల్లి మండలాల్లోను భూమి కంపించింది. 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదు. స్వల్ప తీవ్రతతో సంభవించిన భూకంపం గురించి భయపడాల్సిన పనేమీ లేదని వాతావరణ శాఖ తెలిపింది.