: కుదేలైన పాక్ జట్టుకు అక్రమ్ బాసట
చిరకాల ప్రత్యర్థి భారత్ పై ఓటమి... ఆ తర్వాతి మ్యాచ్ లో విండీస్ చేతిలో దారుణ పరాభవం! వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు ప్రస్థానం ఇది. వరుస పరాజయాల నేపథ్యంలో, పాక్ జట్టుపై స్వదేశంలో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. జట్టు ప్రదర్శనకు వ్యతిరేకంగా లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది కూడా. దీంతో, తర్వాతి మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలంటూ టీమ్ మేనేజ్ మెంట్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచింది. అలా ఒత్తిడికి గురిచేయడం సరికాదంటున్నాడు పేస్ లెజెండ్ వసీం అక్రమ్. గంటలకొద్దీ ఆటగాళ్లకు హితబోధ చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించలేరని, సుదీర్ఘ సమయం పాటు సమావేశాలు నిర్వహించి ఆటగాళ్లను విసిగించవద్దని సూచించాడు. పాక్ క్రికెట్ పెద్దలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్నాడు. ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచడం ద్వారా, వాళ్లు తర్వాతి మ్యాచ్ కు తాజాగా బరిలో దిగేందుకు సహకరించాలని సలహా ఇచ్చాడు.