: వచ్చే ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు భర్తీకీ కేంద్రం సాయం: జైట్లీ
పార్లమెంటులో 14వ ఆర్థిక సంఘం నివేదికను ప్రవేశపెట్టినట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దేశంలో 11 రాష్ట్రాలు ఆర్థిక లోటుతో ఉన్నాయని ఆర్థిక సంఘం చెప్పినట్టు మీడియా సమావేశంలో తెలిపారు. మొత్తం రూ.1,94,021 కోట్ల లోటు ఉందని చెప్పారు. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు భర్తీ కోసం సాయం చేయనున్నట్టు వెల్లడించారు. 2015 నుంచి 2020 వరకు ఏపీకి రూ.22,113 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. * ఏపీకి 2015-16కు రూ.6609 కోట్లు * 2016-17కు రూ.4930 కోట్లు * 2017-18కు రూ.4430 కోట్లు * 2018 -19కు రూ.3644 కోట్లు * 2019-20కు రూ.2499 కోట్లు ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం రెండు రాష్ట్రాల్లోనే రెవెన్యూ మిగులు ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గుజరాత్ రెవెన్యూ మిగులు రూ.11 వేల 795 కోట్లు ఉందని చెప్పారు. ఇదే సంవత్సరానికిగానూ తెలంగాణకు రూ.818 కోట్లు ఉందని వివరించారు. కాబట్టి రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలు క్రమంగా స్వయం సమృద్ధి సాధించాలని జైట్లీ అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని, మరో 4 నుంచి 5 శాతం వాటా స్థానిక సంస్థల ద్వారా ఇవ్వాలని ఆర్థికసంఘం సిఫారసు చేసినట్టు జైట్లీ పేర్కొన్నారు.