: మళ్లీ ఫామ్ లోకొచ్చిన గేల్... జింబాబ్వేపై 106 బంతుల్లో సెంచరీ
ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా విరుచుకుపడే క్రిస్ గేల్, తిరిగి ఫామ్ లోకొచ్చాడు. నిన్నటిదాకా చెత్త ఫామ్ తో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు పెను సమస్యగా మారిన అతడు, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో తిరిగి ఫామ్ లోకి రావడం వెస్టిండీస్ జట్టుకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లే. నేటి ఉదయం జింబాబ్వేతో మొదలైన మ్యాచ్ లో జూలు విదిల్చిన గేల్, శతకంతో అదరగొట్టాడు. 106 బంతుల్లో సెంచరీని పూర్తి చేసిన గేల్, తన కెరీర్ లో 22వ శతరాన్ని నమోదు చేశాడు. మరోవైపు జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో ఆదిలోనే వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ మరో వికెట్ నష్టపోకుండానే భారీ స్కోరు దిశగా సాగుతోంది. 37 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 177 పరుగులు చేసింది. గేల్ (108), సామ్యూల్స్ (59) క్రీజులో కొనసాగుతున్నారు.