: 1, 3 శనివారాలు బ్యాంకుల్లో ఫుల్ డే... 2, 4 శనివారాలు సెలవు
ఇకపై ప్రతినెలా 2, 4వ శనివారాలు ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా పనిచేయవు. ఈ రెండు రోజులనూ సెలవుల్లో కలిపేందుకు ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగుల సంఘాలు, బ్యాంకు యాజమాన్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ సెలవులకు బదులుగా 1, 3 శనివారాలతో పాటు, ఏదైనా నెలలో 5వ శనివారం వస్తే ఆ రోజు కూడా బ్యాంకులు పూర్తి సమయం పనిచేస్తాయి. ప్రస్తుతం అన్ని శనివారాల్లో బ్యాంకులు ఒక్కపూట మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి విదితమే. దీంతోపాటు ఉద్యోగుల వేతనాలను 15 శాతం మేర పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ అనుమతి రాగానే వేతన పెంపు నిర్ణయం అమలు కానుంది. ఈ ఒప్పందాలు కుదిరిన తరువాత ఈనెల 25 నుంచి 4 రోజుల పాటు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విరమించుకున్నట్టు బ్యాంకు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.