: తెలంగాణ సచివాలయం నుంచి మీడియా గెట్ ఔట్... అలాంటిదేమీ లేదంటున్న సర్కారు


తెలంగాణ ప్రభుత్వం అనుకున్నంతా చేస్తోంది. సచివాలయంలోకి మీడియాను అనుమతించరాదన్న నిర్ణయాన్ని వేగంగానే అమలులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. నిన్నటి ఘటనను పరిశీలిస్తే, సదరు నిబంధన దాదాపుగా అమలులోకి వచ్చేసిందా? అన్న అనుమానం కలిగింది. సీఎం కార్యాలయం ఉన్న సమత బ్లాకులోని సీపీఆర్ఓ ఆఫీస్ నుంచి మీడియాను సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా పంపించివేశారు. దీంతో కంగుతిన్న మీడియా ప్రతినిధులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో అయోమయానికి గురయ్యారు. అయితే సచివాలయంలోకి మీడియా ప్రవేశాన్ని నిషేధించలేదని ఆ తర్వాత సమాచార శాఖ కమిషనర్ తో పాటు సీపీఆర్ఓ ప్రకటించారు. మరి సెక్యూరిటీ సిబ్బంది, మీడియా ప్రతినిధులను సీపీఆర్ఓ కార్యాలయం నుంచి బయటకు ఎందుకు పంపారన్న విషయం వెల్లడి కాలేదు. ‘‘సచివాలయంలో మీడియా నిషేధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటిలాగే మీడియా సచివాలయంలోకి ప్రవేశించవచ్చు. అయితే మీడియా స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిది’’ అని సీపీఆర్ఓ వనం జ్వాలా నరసింహరావు పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాలతో తమకేమీ సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News