: సిక్స్ ప్యాక్ కావాలంటే... కేజీ బియ్యానికి 2,200 రూపాయలు పెట్టాల్సిందే!
సిక్స్ ప్యాక్ కావాలంటే దాని కోసం ఎంతో కష్టపడాలి. రెగ్యులర్ డైట్ ఫాలో కావాలి. అన్నిటికీ మించి జిమ్ లో గంటలు తరబడి శారీరక శ్రమ చేయాలి. వీటన్నింటినీ కాస్త సులభతరం చేసే ఆధునిక సొబగులు జిమ్ లలో దొరుకుతున్నాయి. సిక్స్ ప్యాక్ కావాలని తపించే వారికోసం కొన్ని సప్లిమెంట్లు వాడకం అలవాటు చేసుకుంటోంది నేటి యువతం. దీనికి కారణం సినిమాల్లో హీరోలు, విలన్లను చూసి రాత్రికి రాత్రే సిక్స్ ప్యాక్ సంపాదించాలని కలలు కంటున్నారు. దీంతో జిమ్ ల వెంటపడుతున్నారు. వీరి కోరకను బట్టి సప్లిమెంట్స్ ఉంటాయి. సిక్స్ ప్యాక్ లో ఆహార నియంత్రణ ప్రధానమైన అంశం. అందుకే ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్ క్లూజివ్ ప్రొటీన్ రైస్ (క్వినోరైస్)ను తినిపిస్తారు. ఇవి కేజీ 1800 రూపాయలు మాత్రమే. అదే ఆర్గానిక్ అయితే వాటి ధర 2200 రూపాయలు. ఇవి రోజుకి 100 గ్రాములు సరిపోతాయి. ఓట్స్ లా ఉండే పుష్ కుష్ కేజీ 600 పలుకుతోంది. అలాగే 20 రోజులకు సరిపడే ప్యూర్ ప్రొటీన్ టిన్ ఒక్కోటి 8000 రూపాయల వరకు పలుకుతుంది. దాంతో పాటే హోల్ గ్రెయిన్స్ బ్రౌన్ బ్రెడ్ కేవలం 300 రూపాయలకే దొరికేస్తోంది. మరి కూల్ డ్రింక్ లా అనిపించే ప్రీ-వర్కవుట్ డ్రింక్ నైట్రిక్ ఆక్సైడ్ టిన్ ధరెంతనుకుంటున్నారు? కేవలం 4,000 రూపాయలే! ఇవి కాకుండా మాస్ గెయినర్స్, వెయిట్ గెయినర్స్ కూడా లభిస్తాయి. వీటిని వాడుతూ సిక్స్ ప్యాక్ సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. కానీ, వీటి వాడకానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరని చెబుతున్నారు. సులువుగా సిక్స్ ప్యాక్ రావాలంటే ఆమాత్రం ఖర్చు చేయకతప్పదని సూచిస్తున్నారు.