: ఏపీ, తెలంగాణలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వాదన బలపడుతోంది. ఈ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగం విన్న తర్వాత ఈ డౌట్ మరింత బలపడింది. సభలో ప్రసంగించింది రాష్ట్రపతే అయినప్పటికీ, ప్రసంగం ఎలా ఉండాలన్నది నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అన్న సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం చెప్పాలనుకున్నదే రాష్ట్రపతి తన ప్రసంగంలో చదువుతారు. ఈరోజు రాష్ట్రపతి తన ప్రసంగంలో అనేక అంశాల గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం సాధించింది ఏమిటి? రానున్న రోజుల్లో ఏం చేయబోతోంది? తదితర అంశాలపై నాన్ స్టాప్ గా మాట్లాడిన ప్రణబ్ దాదా... తన ప్రసంగంలో కొత్త రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం గమనార్హం. ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు... అలాగే, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన సహాయ సహకారాలు వంటి అంశాలేమైనా ఉంటాయేమో అని అందరూ ఎదురు చూశారు. చివరకు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో అందరూ ఉసూరుమన్నారు.