: రాజయ్యను బర్తరఫ్ చేశారు... ముడుపులందుకున్న జగదీష్ రెడ్డిని ఎందుకు చేయడం లేదు?: పొన్నం ఫైర్
తెలంగాణ విద్యాశాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదలలో జగదీష్ రెడ్డికి 5 శాతం ముడుపులు అందాయన్న తన ఆరోపణలు వాస్తవమని... దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. విద్యాశాఖ తనది కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న జగదీష్ రెడ్డి... కాలేజీల యాజమాన్యం నుంచి లంచాలు తీసుకుంది ఎవరో తెలపాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలతో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేశారని... మరి, జగదీష్ రెడ్డి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని... తమ దగ్గరున్న ఆధారాలను కూడా చూపెడతామని చెప్పారు. జగదీష్ రెడ్డి మాట్లాడే విధానం చాలా దారుణంగా ఉంటోందని... అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కూడా అవమానించే రీతిలో జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.