: పోరాటం లేదూ... వంకాయా లేదు: ఏపీ ప్రత్యేక హోదాపై అనంత ఎంపీ జేసీ నిట్టూర్పు
మరికొద్ది సేపట్లో మొదలుకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోతుందా? అని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే, అనంతపురం లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏ స్థాయిలో పోరాటం చేయబోతున్నారన్న విలేకరుల ప్రశ్నలకు వ్యంగ్యంగా స్పందించిన ఆయన ‘‘ పోరాటమా? వంకాయా?’’ అంటూ నిట్టూర్చారు. ‘‘ఏంది పోరాటం చేసేంది? 500 సీట్లలో 375 సీట్లు అనుకుంటా బీజేపీ మెజార్టీ. పోరాటం లేదూ... వంకాయా లేదు. సీఎంతో వెళ్లి నాలుగు నమస్కారాలు పెట్టి, రాష్ట్రంపై దయతలచమనడమే కానీ, ఎందుకు చేయరని అడిగే శక్తి లేదు. షర్ట్ పట్టుకుని అడగలేం. పోతున్నాం... వస్తున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు నిన్న పశ్చమ గోదావరి జిల్లా ఏలూరుకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ మేరకు నిట్టూర్పు వ్యాఖ్యలు చేశారు.