: ధోనీ! నీ కుమార్తె నీకు అదృష్టం తెస్తుంది...కప్పుతో వెళ్తావు: వీరాభిమాని


‘నీ కూతురు అదృష్టాన్ని తెస్తుంది. ప్రపంచకప్‌తో తిరిగి వెళతావు’ అంటూ టీమిండియా ప్రాక్టీస్ సందర్భంగా ధోనికి ఓ అభిమాని శుభాకాంక్షలు చెప్పాడు. అయితే ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారు? పాకిస్థాన్ వీరాభిమాని. అమెరికాలో హోటల్ నడుపుకునే పాకిస్థాన్ కు చెందిన బషీర్, పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఏదయినా మెగాటోర్నీలో ఆడితే అక్కడ వాలిపోతాడు. అయితే ఇతను కేవలం పాక్ కు మాత్రమే కాదు, భారత్ జట్టుకు కూడా అభిమానే. రెండు దేశాల మధ్య ఎక్కడ మ్యాచ్ జరిగినా రెండు జాతీయ జెండాలతో పోలిన డ్రెస్ ధరించి రెండు జాతీయ జెండాలు పట్టుకుని హాజరవుతాడు. వరల్డ్ కప్ సందర్భంగా అడిలైడ్‌ లోనూ భారత్, పాక్ మ్యాచ్ చూశాడు. పాక్ జట్టు ఆట చూసి విరక్తి పుట్టిందేమో కానీ, భారత జట్టు వెంట తిరుగుతున్నాడు. ధోని అంటే బషీర్ కి వల్లమాలిన అభిమానం. గత ఏడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ కు ధోనీయే బషీర్‌ కు టికెట్ ఇచ్చాడు. మెల్ బోర్న్ లో జరుగుతున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ దగ్గరకు వచ్చాడు. టీ షర్ట్‌పై ‘ధోని ఐ లవ్ యూ’ అని రాసి ఉండడంతో చూసిన ధోనీ నవ్వుకున్నాడు. అంతలోనే బషీర్‌ ను గుర్తుపట్టి చిరునవ్వుతో పలకరించాడు. తరువాత బషీర్ టీ షర్టుపై సంతకం చేశాడు. అప్పుడే బషీర్ మాట్లాడుతూ, ‘నీ కూతురు అదృష్టాన్ని తెస్తుంది, వరల్డ్ కప్ తోనే వెళ్తావు’ అని అన్నాడు. దీంతో ధోని ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయాడు. బషీర్‌ కు రోహిత్ శర్మ తన కళ్లద్దాలను బహుమతిగా ఇచ్చాడు. దీంతో బషీర్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బషీర్ కి భారత్ లోని హైదరాబాదుతో సంబంధం ఉందండోయ్, బషీర్ హైదరాబాద్ అల్లుడు మరి!

  • Loading...

More Telugu News