: ఐఎస్ఐఎస్ లో చేరిన ముగ్గురు లండన్ విద్యార్థినులు
ఇరాక్, సిరియాలలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య బ్రిటన్ లో రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ముగ్గురు స్కూల్ విద్యార్థినులు ఐఎస్ఐఎస్ లో చేరేందుకు దేశం విడిచి వెళ్ళారని బ్రిటన్ ప్రధాని స్వయంగా ప్రకటించారు. లండన్ నుంచి కదీజా సుల్తానా (16), షమీమా బేగం (15), మరో గుర్తు తెలియని 15 సంవత్సరాల అమ్మాయి దేశం వీడారని తెలిపారు. ఈనెల 17న తాము పిక్నిక్ కు వెళ్తున్నామని చెప్పి వీరు ఇళ్ల నుంచి వెళ్లారు. ఆ తరువాత గాత్విక్ ఎయిర్ పోర్ట్ సీసీటీవీ కెమెరాల్లో వీరు ఇస్తాంబుల్ విమానం ఎక్కినట్టు తెలిసింది. ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు బ్రిటన్ లోని ముస్లిం సంఘాలు కల్పించుకోవాలని ఆయన కోరారు. వీరిని వెనక్కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కాగా, 2014 ఆరంభం నుంచి కనీసం 3 వేల మందికి పైగా ఇరాక్, సిరియాలకు వెళ్ళారని తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ లో చేరుతున్న మహిళలు యుద్ధం పట్ల ఆకర్షితులై వెళ్తున్నారని, అలా కుదరకుంటే, కనీసం జీహాదీలకు భార్యలుగా వుండిపోతున్నారని అధికారులు తెలిపారు. మొత్తం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో కనీసం 25 శాతం మంది విదేశీయులేనని వివరించారు.