: ఇప్పుడు బంగారం కొనద్దంటున్న నిపుణులు!
బంగారం అంటే భారతీయులకు, ముఖ్యంగా అతివలకు ఎంత ఇష్టమో తెలియంది కాదు. వివాహాది శుభకార్యాలు, పర్వదినాల్లో, డబ్బులు చేతిలో ఉంటే మన ఆలోచనలు వెళ్ళేది బంగారం వైపే. అయితే, ఇప్పటికిప్పుడు బంగారం కొనాలని భావిస్తున్నవారు కొంతకాలం ఆగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తక్షణం బంగారం కొనడం వల్ల సమీప భవిష్యత్తులో చింతిస్తారని చెబుతున్నారు. ఎందుకంటే, రాబోయే బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గిస్తారన్న అంచనాలు అధికంగా వున్నాయి. ప్రస్తుతం బంగారాన్ని దిగుమతి చేసుకుంటే 10 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంది. ఈ 10 శాతం చెల్లించడం ఇష్టంలేకనే వివిధ దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని ప్రజలు తీసుకువస్తున్న ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర లేకున్నా ఎంతోమంది అక్రమంగా విమానాల్లో బంగారం తెచ్చి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దీన్ని అరికట్టేందుకు సుంకాల తగ్గింపు దిశగా చర్యలు చేపడతామని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా, సుంకం తగ్గింపు ప్రకటిస్తే, ప్రస్తుతం రూ.26,340 (ఏప్రిల్ లో డెలివరీ అయ్యే 10 గ్రాములకు ఎంసిఎక్స్ ధర) వద్ద ఉన్న రేటు రూ.24,500 వరకూ ఒక్కసారిగా పడిపోతుంది. అందువల్లే, ఇప్పుడు బంగారం కొనాలని భావిస్తున్న వారిని కొంతకాలం ఆగమని సలహా.