: ఆ మూడు జట్లపై ఎవరితో ఓడినా పాక్ ఇంటికే!
ప్రస్తుత వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో వరుసగా రెండు మ్యాచ్ లలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు క్వార్టర్ ఫైనల్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఇప్పటికే రెండు పెద్ద జట్లు ఇండియా, వెస్టిండీస్ చేతుల్లో ఓటమి చవిచూసిన ఆ జట్టు తిరిగి కోలుకోవాలంటే తదుపరి మ్యాచ్ లను భారీ తేడాలతో నెగ్గాల్సి ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఐర్లాండ్, జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలపై తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మూడు దేశాల్లో ఏ దేశమైనా పాకిస్తాన్ ను ఓడిస్తే క్వార్టర్ ఫైనల్ అవకాశాలు ఆ జట్టుకు దాదాపు లేనట్టేనని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. తానాడిన రెండు మ్యాచ్ లలో ఓడి మైనస్ 2.26 నెట్ రన్ రేటుతో ఉన్న ఆ జట్టు పూల్ బీలో బలమైన సౌతాఫ్రికాతో పోరు అత్యంత కీలకం. మరో 4 మ్యాచ్ లు పాక్ ఆడనుంది. వీటిల్లో కనీసం మూడింటిలో ప్రత్యర్థి జట్లపై 226 పరుగుల ఆధిక్యంతో ఆ జట్టు గెలవాల్సి ఉంది. అప్పుడే క్వార్టర్ ఫైనల్ కు పాకిస్తాన్ అవకాశాలు నిలిచి ఉంటాయి.