: విజయనిర్మలపై 'గిన్నిస్ బుక్ విజేత' పుస్తకం
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మలపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు గిన్నిస్ బుక్ విజేత అనే పుస్తకాన్ని రాశారు. దీనిని ఆమె పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాదులోని ఆమె నివాసంలో సినీ ప్రముఖల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆవిష్కరించి, సూపర్ స్టార్ కృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఎంతో ఇష్టమైన నటి విజయనిర్మల అన్నారు. బి.జయ, నందినీ రెడ్డి వంటి మహిళా దర్శకులకు స్పూర్తిగా నిలిచిన విజయనిర్మల గారిపై రాసిన గిన్నిస్ బుక్ విజేత పుస్తకాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని అన్నారు. కృష్ణ మాట్లాడుతూ, ఈ ఏడాది విజయనిర్మల పుట్టిన రోజుకు ప్రత్యేకత ఉందని అన్నారు. ఆమె నటించిన, దర్శకత్వం వహించిన ప్రతి సినిమా గురించి వినాయకరావు రాశారని ఆయన పేర్కొన్నారు. నటుడు నరేష్ మాట్లాడుతూ, గతేడాది ఇదే రోజున దర్శకరత్న దాసరి మాట్లాడుతూ, తన తల్లి మంచి నటి, దర్శకురాలని అన్నారు. కానీ తన తల్లి మంచి సంఘసంస్కర్త, స్పూర్తి దాత, వ్యవసాయవేత్త అలాంటి ఆమెపై వినాయకరావు రాసిన పుస్తాకాన్ని చూసి తాము గర్వపడుతున్నామని అన్నారు.