: భారత్ లో కాలుష్యాన్ని అమెరికా తగ్గిస్తానంటోంది
భారత్ లో కాలుష్యాన్ని అమెరికా తగ్గిస్తానంటోంది. దౌత్య సహకారంలో భాగంగా భారత్ లో నానాటికీ పెరిగిపోతున్న వాయికాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు సహకారం అందిస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. ఈ మేరకు రానున్న రెండు మూడు నెలల్లో ఢిల్లీ కేంద్రంగా ఓ పథకం ప్రారంభిస్తామని, కాలుష్య నియంత్రణకు చేపట్టవలసిన చర్యలను భారత్ కు అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇలాంటి 'వాతావరణ హిత' సహకారం అందజేస్తామని చెప్పిన పెద్దన్నకు చైనా షాక్ ఇచ్చింది. చైనా నగరాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని, దానిని అదుపు చేసేందుకు సహాయసహకారాలు అందిస్తామని అమెరికా ప్రకటించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులను చేయవద్దని అమెరికాకు హితవు పలికింది. దీంతో అమెరికా చూపు భారత్, వియత్నాం, మంగోలియా తదితర దేశాలపై పడింది.