: భార్యను రక్షించుకోవాలన్న తపనే...ఏడు మారథాన్లలో విజేతగా నిలిపింది!
ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న భార్య ముఖంలో చిరునవ్వు చెదిరిపోకూడదని భావించిన జాక్సన్ ప్రాణాలకు తెగించి పరుగందుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన టెడ్ జాక్సన్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఖండాంతరాల్లో జరిగిన ఏడు మారథాన్లలో పాల్గొని విజేతగా నిలిచి కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మొత్తాన్ని భార్యకు చికిత్స అందిస్తున్న ప్రొఫెసర్ జార్జి జెలినెడ్ నేతృత్వంలోని ఛారిటీ సంస్థకు అందజేశాడు. జాక్సన్ తన 20వ ఏటనే 18 ఏళ్లున్న సోఫీని వివాహమాడాడు. 2010 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడచిపోతున్న సంసారంలో పెను తుపాను రేగింది. ఆమెకు మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే నరాల జబ్బు సోకినట్టు గుర్తించారు. దీనికి వైద్యం లేదని, కేవలం జీవిత కాలం పొడిగించడం మాత్రమే చేయగలరని తెలిసిన జాక్సన్ తన సహచరిని వీలైనంత ఎక్కువ కాలం చూడాలనుకున్నాడు. అందుకు మార్గాలు వెతుక్కున్నాడు. దీంతో మారథాన్ మార్గంగా తోచడంతో దానిని సమర్ధవంతంగా పూర్తి చేశాడు. 42 ఏళ్ల టెడ్ జాక్సన్ మారథాన్ లో పాల్గొనేంతవరకు అథ్లెట్ కాదు. ఏనాడూ పరుగు పందేల్లో పాల్గొన లేదు. మల్టిపుల్ స్క్లెరోసిస్ (ప్రాణాంతక నరాల జబ్బు)తో బాధ పడుతున్న భార్యను రక్షించుకోవాలన్న లక్ష్యంతో మారథాన్ లో పాల్గొన్నాడు. గడ్డకట్టిన మంచు ప్రాంతాలను, బొబ్బలెక్కే ఎడారులను లెక్క చేయకుండా సాగిన ఏడు మారథాన్లను ఏడు రోజుల్లో ముగించి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. అంటార్కిటిక, మొరాకో, దుబాయ్, మియామీ, చిలీ, మాడ్రిడ్, సిడ్నీలలో జరిగిన ఏడు మారథాన్లలో పాల్గొని 182 మైళ్లు పరుగుతీశాడు.