: మోదీ సూటు 4.31 కోట్లు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బంద్ గళా సూట్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడు పోయింది. పది లక్షల రూపాయలు పెట్టి కుట్టించిన సూటు, 4.31 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడం విశేషం. ప్రధానిగా అధికారం చేపట్టిన నాటి నుంచి అందుకున్న బహుమతుల్లో కొన్నింటిని సూరత్ లో జరిగిన వేలంలో పెట్టిన మోదీ, అలా సమకూరిన మొత్తాన్ని గంగానది ప్రక్షాళనకు వినియోగించనున్నారు. మోదీ వస్తువులతో ఏర్పాటు చేసిన ఈ వేలానికి భారీ స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వేలం పాటలో 11 లక్షల రూపాయలకు ప్రారంభమైన ఈ కోటు ధర, 4.31 కోట్ల రూపాయలతో ఆగింది. సూట్ ను సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి పటేల్ కొనుక్కున్నాడని నిర్వాహకులు వెల్లడించారు. దీని పట్ల ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నప్పటికీ మోదీ హర్షం వ్యక్తం చేయడం విశేషం.