: ఒబామాకు అమెరికాపై ప్రేమలేదు... న్యూయార్క్ మాజీ మేయర్ సంచలన వ్యాఖ్య... సమర్థించిన బాబీ జిందాల్
న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గులియానీ అధ్యక్షుడు ఒబామాపై చేసిన వ్యాఖ్యలు సంచలనంతో పాటు రాజకీయ దుమారాన్ని రేపాయి. "ఇదో భయంకరమైన నిజం. అధ్యక్షుడు ఒబామా అమెరికాను ప్రేమిస్తున్నాడని నేను నమ్మడం లేదు" అని ఆయన అన్నారు. "నిజాయతీగా చెప్పాలంటే, ఆయన నిజంగా దేన్ని నమ్ముతారో నాకు, మీకు తెలియదు. ఆయన మనసులో ఏముందో నేను చెప్పలేను. ఆయన ప్రవర్తించే వైఖరిపై మాట్లాడుతున్నాను" అని మన్హటన్ లో జరిగిన ఓ నిధుల సమీకరణ కార్యక్రమంలో రూడీ అన్నారు. "ఆయన మిమ్మల్ని ప్రేమించడం లేదు. నన్ను కూడా. మీరు, నేను పెరిగిన విధంగా ఆయన పెరగలేదు" అని కూడా అన్నారు. ఆ వెంటనే స్పందించిన వైట్ హౌస్ వర్గాలు దీన్ని 'ఘోరం'గా అభివర్ణించాయి. కాగా, తన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నట్టు నిన్న సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూడి తెలిపారు. ఆయనకు మద్దతుగా లూసియానా గవర్నర్, ఇండియన్-అమెరికన్ బాబీ జిందాల్ నిలిచారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ఆయన నిజాలను మాట్లాడంలో విఫలం అవుతున్నారని, అందువల్లే రూడీ ఇలాంటి మాటలు అని ఉండవచ్చని జిందాల్ తెలిపారు.