: కార్నెగి మిలన్ పిల్లిమొగ్గలు...సీటు రాకున్నా వచ్చిందంటూ 800 మంది విద్యార్థులకు సందేశాలు
కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో ప్రపంచంలోనే కార్నెగి మిలన్ యూనివర్సిటీది అగ్రస్థానం. అలాంటి యూనివర్సిటీ తన స్థాయిని మరచి వ్యవహరిస్తోంది. సీట్లు రాకున్నా, వచ్చాయంటూ విద్యార్థులను అయోమయంలోకి నెడుతోంది. ఈ తరహా చర్యలతో ఏ ఒక్కరో, ఇద్దరో విద్యార్థులు ఇబ్బంది పడ్డారనుకుంటే పొరపాటే. ఎందుకంటే, 800 మందికి పైగా విద్యార్థులను వర్సిటీ అయోమయంలోకి నెట్టేసింది. వివరాల్లోకెళితే... ఈ ఏడాది ప్రవేశాల కోసం దాదాపు వెయ్యి మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీలో 120 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే వర్సిటీ మాత్రం మీకు సీటొచ్చిందంటూ ఏకంగా 900 మంది విద్యార్థులకు సందేశాలు పంపింది. గంటల్లోనే జరిగిన పొరపాటును గమనించి, 800 మంది విద్యార్థులకు మళ్లీ మెసేజ్ లు పంపింది. ‘‘మీకు సీటు రాలేదు. పొరపాటున మెసేజ్ వచ్చింది. పొరపాటుకు చింతిస్తున్నాం. మా తిరస్కరణను ఆమోదిస్తున్నట్లు రిప్లై కూడా ఇవ్వండి’’ అంటూ ఆ మెసేజ్ లో పేర్కొంది. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో సీటు దొరికిందని సంతోషపడ్డ 800 మంది విద్యార్థులు వర్సీటి నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.