: దెయ్యంగా మారిన న్యాయమూర్తి!... భయంతో మూతపడ్డ మైసూరు కోర్టు హాల్!
కర్ణాటకలోని మైసూర్ కోర్టు హాలులో ఒక దెయ్యం తిరుగుతోందనే పుకార్లు ప్రచారం అవుతున్నాయి. దెయ్యం దెబ్బకు ఓ కోర్టు హాలు కొన్ని నెలలుగా మూతపడింది. ఈ ఘటన తొమ్మిది నెలల క్రితం జరగగా, మళ్ళీ హాలును తెరవాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. హాలు తలుపులు తీయవద్దని కొందరు, తెరవాలని మరి కొందరు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. లాయర్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ విషయంలో పరస్పర ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో ఆ కోర్టు హాలును తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు. కాగా, గతంలో ఇదే కోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయి దెయ్యమై అందులో సంచరిస్తున్నాడన్న పుకార్లతో కోర్టు హాలును మే 2014లో మూసివేశారు. ప్రస్తుతం ఇందులో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు వేసి స్టోర్ రూమ్గా వాడుతున్నారు. ఒకవేళ దీన్ని తప్పనిసరిగా తెరవాలని భావిస్తే, శాంతి పూజలు నిర్వహించాల్సిందేనని జ్యోతిష్యులు సూచించారట.