: చెన్నైలో ‘లింగా’ ప్రకంపనలు... పోటాపోటీ నిరసనల్లో డిస్ట్రిబ్యూటర్లు, రజనీ అభిమానులు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం లింగా చెన్నైలో తీవ్ర ఉద్రిక్తతలకు తెరలేపింది. అంచనాలను అందుకోవడంలో చిత్రం చతికిలబడటంతో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు. తమను ఆదుకోవాలంటూ వారు కొంతకాలంగా చేయని యత్నం అంటూ లేదు. ఎట్టకేలకు రంగంలోకి దిగిన రజనీకాంత్ సూచనతో పది శాతం మేర నష్టాలను భరించేందుకు నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ అంగీకరించినా, డిస్ట్రిబ్యూటర్లు సమ్మతించలేదు. భిక్షాటన తప్ప గత్యంతరం లేదని భావించిన వారికి ఓ రాజకీయ నేత కూడా మద్దతు పలికారట. సదరు నేతాశ్రీ సూచనతో భిక్షాటనను రజనీ నివాసం నుంచే మొదలుపెట్టాలని కూడా డిస్ట్రిబ్యూటర్లు తీర్మానించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజనీ అభిమానులు భగ్గుమన్నారు. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళనలకు వ్యతిరేకంగా నిరసనకు దిగనున్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు నేటి ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ విషయంలో రజనీకి మద్దతు పలికేందుకు దక్షిణ భారత నటీనటుల సంఘం నిరాకరించింది. రజనీ అభిమానుల హెచ్చరికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ల భిక్షాటనకు పోలీసుల అనుమతి లభిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.