: ఒంటిమిట్టలో నవమి వేడుకల ఏర్పాట్లు... రామతీర్థంలో రగులుతున్న సెగలు
శ్రీరామ నవమి వేడుకల ఏర్పాట్లు ఏపీలో పెనువివాదానికి తెర లేపుతున్నాయి. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో నవమి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒంటిమిట్టలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఒంటిమిట్టలో నవమి అధికార వేడుకలపై చిత్తూరు జిల్లాతో పాటు విజయనగరం జిల్లా ప్రజలు కూడా భగ్గుమన్నారు. వాల్మీకిపురంలోనే నవమి వేడుకలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు తమ జిల్లాకు చెందిన సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు నిర్ణయించారు. మరోవైపు రామతీర్థంలోనే నవమి అధికార వేడుకలు నిర్వహించాలని విజయనగరం జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు రామతీర్థం ప్రజలు నేటి ఉదయం ఆందోళనకు దిగారు. ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థంలో వేడుకలను నిర్వహించకుండా ఒంటిమిట్ట ఆలయాన్ని ఎంచుకోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలను అధికారికంగా నిర్వహించేవారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోవడంతో ఏపీలో అధికార వేడుకలకు ఆలయాన్ని ఎంపిక చేయాల్సి వచ్చింది. ఒంటిమిట్ట కోదండరామాలయంలో వేడుకలను నిర్వహించాలన్న సర్కారు నిర్ణయంపై చిత్తూరు, విజయనగరం జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.