: స్మార్ట్ ఫోన్ తో కాలుష్యానికి చెక్
స్మార్ట్ ఫోన్ సహాయంతో వాతావరణంలోని వాయు కాలుష్యం శాతాన్ని గుర్తించి తగ్గించవచ్చని లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా పట్టణ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గాలిలో కాలుష్యం తీవ్రత పెరగడంతో చిన్నపిల్లలు, వయోవృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. తాము పీలుస్తున్న గాలిలో ఎంత శాతం కాలుష్యం ఉందో తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుందని వారు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కాలుష్యం నమోదవుతోందని వారు చెప్పారు. దీంతో మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎక్కడ, ఎప్పుడు ఎంత మొత్తంలో వాయు కాలుష్యం పోగవుతుందో, దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవచ్చని వారు వివరించారు. బార్సిలోనాలోని సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఎపిడిమాలజీకి చెందిన శాస్త్రవేత్త మార్క్ జే నెవెంజ్ సేన్, ఆయన బృంద సభ్యులు స్మార్ట్ ఫోన్ సహాయంతో వాయుకాలుష్యం గుర్తించారు. సెన్సర్లను అమర్చిన శాస్త్రవేత్తలు వాటిని స్కూలు పిల్లలకు ఇచ్చి పరిశోధన నిర్వహించారు. దీంతో పరిశోధనలను మెరుగు పరిచి దానిని స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించారు. దీంతో ఏ ప్రాంతంలో ఎంత మేర కాలుష్యం ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉందని వారు తెలిపారు.