: తనకన్నా ఏడేళ్ల చిన్నవాడిని హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోనున్న యూఎస్ కాంగ్రెస్ మెంబర్ తులసీ గబార్డ్
ఆమె యూఎస్ కాంగ్రెస్ లో తొలి హిందు మెంబర్. పేరు తులసీ గబార్డ్ (33). ఈమె త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు. తనకన్నా ఏడేళ్ళు చిన్నవాడైన సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ (26)ను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో హిందు సంప్రదాయ పద్ధతుల్లో జరిగే వివాహం ద్వారా తాము ఒక్కటవుతున్నామని నేడు ఆమె వెల్లడించారు. తమకు నిశ్చితార్థం జరిగి నెల రోజులు దాటిందని ఆమె చెప్పారు. ఆ సమయంలో విలియమ్స్ తన చేతి వేలికి డైమండ్ రింగ్ తొడిగారని మురిపెంగా తెలిపారు. ఆయన సుగుణాలను వివరిస్తూ, బోళాతనం, మంచితనం మూర్తీభవించిన వ్యక్తి అని పొగిడారు. కాగా, ప్రస్తుతం విలియమ్స్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ తోపాటు రాజకీయ, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణ సేవలందిస్తున్నారు.