: భూమి సూర్యుడి చుట్టు తిరగట్లేదు... ఉన్న చోటే స్థిరంగా ఉంది: సౌదీ ముస్లిం మత గురువు కొత్త సిద్ధాంతం
భూమి సూర్యుడి చుట్టు తిరుగుతున్నట్లు... అనే సామెతకు కాలం చెల్లినట్టే. ఎందుకంటే, అసలు భూమి కదిలితే కదా ఆ మాట చెప్పడానికి. నిశ్చలంగా, ఉన్న చోటే స్థిరంగా ఉన్న భూమి, సూర్యుడి చుట్టు ఎలా తిరుగుతుందని ప్రశ్నిస్తున్నారు సౌదీ అరేబియాకు చెందిన ముస్లిం మత గురువు షేక్ బందర్ అల్-ఖైబారి. అంటే భూమి సూర్యుడి చుట్టు తిరుగుతుందని ఇప్పటిదాకా చెప్పిన ఖగోళ శాస్త్రవేత్తల మాటలన్నీ అబద్ధమేనన్నమాట. ఈ కొత్త వాదన కోసం ఖైబారి చేస్తున్న వితండ వాదం చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. ‘‘మనమెక్కడున్నాం? చైనాకెళ్లేందుకు విమానం కోసం షార్జా విమానాశ్రయం వెళుతున్నాం. ఓకే!, ఇదిగో ఇదే(నీటి కప్పు) భూమి. నింగికెగసిన విమానం ఆకాశంలో నిలిచిపోయినా చైనా రావాల్సిందేగా. ఎందుకంటే, భూమి తనచుట్టూ తాను సవ్యదిశలో తిరుగుతుందిగా. భూమి తన చుట్టూ తాను తిరిగితే, విమానం నిలిచినా, దాని దగ్గరకే చైనా వస్తుంది. అపసవ్య దిశలో భూమి తిరిగితే, ఎప్పటికీ విమానం దరికి చైనా చేరదు’’ అంటూ ఆయన వాదిస్తున్నారు.