: రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్


మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు భౌతిక కాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అజరామర చిత్రాలను నిర్మించిన రామానాయుడు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమని బాబు పేర్కొన్నారు. రామానాయుడు అంటే వ్యక్తి కాదు, వ్యవస్థ అని నిరూపించారని బాబు తెలిపారు. 13 భాషల్లో సినిమాలు తీయడం సాధారణ విషయం కాదని పేర్కొన్న బాబు, రామానాయుడు, ఎన్టీఆర్ స్పూర్తితో సినీ రంగానికి వచ్చారని అన్నారు. విలువలతో సినిమాలు నిర్మించి, రాజకీయాల్లో కూడా విలువలు పాటించారని అన్నారు. భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన రామానాయుడు మృతి, తెలుగు సినీ రంగానికి తీరని లోటని వారు అభివర్ణించారు. వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు ఎనలేని భక్తి శ్రద్ధలని బాబు చెప్పారు. హైదరాబాదులోనే కాకుండా వైజాగ్ లో కూడా స్టూడియో నిర్మించి, వైజాగ్ స్టూడియోను డెవలెప్ చేయాలని ఆయన అనుక్షణం తపించారని బాబు వెల్లడించారు. ఆయన నిన్న కూడా స్టూడియోకు వెళ్లి కాసేపు గడిపారని బాబు చెప్పారు. రాత్రి అస్వస్థతకు గురైన ఆయన, ఆరోగ్యం విషమించడంతో భౌతికంగా దూరమయ్యారని బాబు చెప్పారు. ఆయన లేకపోయినా, ఆయన స్పూర్తి మనతో ఉంటుందని ఆశిస్తున్నానని బాబు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, రామానాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా బాపట్ల నియోజకవర్గానికి సేవలు అందించిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో ఈనాడు అధినేత రామోజీరావు, జానారెడ్డి, వీహెచ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News