: హైదరాబాద్ నుంచి బెంగళూరు అరగంట, కన్యాకుమారి నుంచి ఢిల్లీ గంటన్నర
హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లాలంటే బస్సులో అయితే పది గంటలు, రైలులో అయితే 12 గంటలు, కారులో హైస్పీడ్ లో వెళ్తే ఆరు గంటలు, విమానంలో వెళ్తే గంట...అలా కాకుండే కేవలం అరగంటలో చేరుకునే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? కన్యా కుమారి నుంచి ఢిల్లీకి రైళ్లో వెళ్లాలంటే రోజున్నర పడుతుంది. అదే గంటన్నరలో వెళ్తే చాలా పనులు జరిగిపోతాయి కదా. ఎలన్ మస్క్ ఆలోచనలు ఫలిస్తే ఆశ్చర్యపోయే రీతిలో ప్రయాణాలు సాగిపోతాయి. హైపర్ లూప్ పేరిట కొత్త రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ హైపర్ లూప్ వ్యవస్థను అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిలెస్ మధ్య ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 558 కిలోమీటర్ల దూరంలో రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 700 కోట్ల డాలర్లు ఖర్చు కానున్నాయి. అయితే ఇదే దూరంలో హైస్పీడ్ రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు దీనికి పది రెట్లు ఎక్కువగా ఖర్చు అవుతోంది. హైపర్ లూమ్ విధానం అంటే అంతరిక్షంలో ఉపగ్రహాల గమనానికి, వేగానికి వినియోగించే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా ఇంధనం వినియోగం లేకుండా పీడనాన్ని ఉపయోగించనున్నారు. కాంక్రీట్ స్థంభాలపై వందల కిలోమీటర్ల మేర గుండ్రటి గొట్టాలతో సొరంగం ఏర్పాటు చేస్తారు. ఈ గొట్టాల్లో అతి తక్కువ పీడనం ఉంటుంది. ఆరు అడుగుల వెడల్పు ఉండే ఈ గొట్టంలో ప్రయాణికుల కోసం బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 28 మంది వరకు ప్రయాణించవచ్చు. అర నిముషానికి ఒక బోగీ ఈ గొట్టాల గుండా ప్రయాణం మొదలుపెడుతుంది. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఏర్పాటు చేస్తారు. అది బాగా వేగం పెరిగేందుకు దోహదం చేస్తుంది. వీటిని వేగం పెంచేందుకు, తగ్గించేందుకు వినియోగిస్తారు. అతి సన్నని తెరపై బోగీ గాలిలో తేలియాడుతూ ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. గొట్టం మొత్తం తక్కువ పీడనం ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగదు. అతి పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా హైపర్ లూప్ స్థంభాలు ఉంటాయి. గొట్టం పొడవునా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఈ ప్యానెళ్లు 76,000 హార్స్ పవర్ విద్యుత్ పంపణీ చేస్తే అందులో 26,000 హార్స్ పవర్ వినియోగించుకుంటుంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే దూరాభారం తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది.