: బర్త్ డే గిఫ్టులు తీసుకోకుండా... ఎదురు బహుమతులిచ్చినట్లుంది: కేసీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
మహారాష్ట్ర పర్యటనను ముగించుకుని తెలంగాణ సీఎం హైదరాబాదులో కాలుమోపారో, లేదో అప్పుడే విమర్శల జడివాన కురుస్తోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చల సందర్భంగా కేసీఆర్, తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని టీ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ముంబైలో బర్త్ డే కేక్ కట్ చేసిన కేసీఆర్... గిఫ్టులు తీసుకోవాల్సింది పోయి, అక్కడి సీఎంకు ఎదురు గిఫ్టులు ఇచ్చివచ్చారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తు తగ్గింపునకు సంబంధించి ఫడ్నవీస్ చేసిన ప్రతిపాదనకు కేసీఆర్ గుడ్డిగా అంగీకరించి వచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు.